-
పాఠశాలల పనివేళలకు ఆటంకం కలిగించకూడదు
-
TPTF సంగారెడ్డి డిమాండ్
సూర్య జ్యోతి, నవంబర్ 02, సంగారెడ్డి : కుల గణన విధులను కేవలం ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మాత్రమే కేటాయించడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఖండిస్తోంది. ప్రాథమిక పాఠశాలలలో ఎక్కువగా ఒకరు, ఇద్దరు పని చేస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా సర్వే విధులకు కేటాయిస్తే, పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతది. ప్రాథమిక పాఠశాలలలో ఆరుగురు ఉపాధ్యాయులకు సర్వే విధులు అప్పగించడం సరికాదు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల నిర్వహించి మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత సెన్సెస్ విధులకు హాజరు కావాలని ఉత్తర్వలు ఇచ్చారు, మద్యాహ్నం సర్వేకు వెళ్ళితే గ్రామస్తులు ఎవ్వరు అందుబాటులో ఉండరు. సర్వే కూడా అనుకున్నట్టుగా సాగదు. ప్రాథమిక పాఠశాలల ఉనికి ఉండాలంటే, ప్రాధమిక పాఠశాలలను ఒక పూట మూసివేయడం సరికాదు. అటు సర్వే, ఇటు పాఠశాలలు కూడా నడవాలి. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి సర్వే విధులు కేటాయించాలని కోరుచున్నాం. ఉదయం పూట సర్వే నిర్వహించి, పాఠశాలలకు ఆటంకం కలగకుండా నిర్వహించే విధంగా కుల గణన ఉత్తర్వులను సవరించి విడుదల చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్, రాష్ట్ర కౌన్సిలర్లు లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్, కంరోద్దీన్, భాస్కర్, ఉపాధ్యక్షులు నాసర్ పటేల్, విజయ్ భాస్కర్, జిల్లా కార్యదర్శులు అశోక్ కుమార్, మల్లికార్జున్ లు డిమాండ్ చేశారు.