సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 4, హైదరాబాద్ : కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివ నామ స్మరణతో ఆలయాలు మారు మ్రోగుతున్నాయి. పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులతో కృష్ణా, గోదావరి తీరాల్లో సందడి నెలకొంది. ప్రముఖ ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో రద్దీ నెలకొంది. రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి ఆ ముక్కంటి కృపా కటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి గో పూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. కార్తిక మాసం మొదటి సోమవారం కావడంతో రెండు సార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజ సేవలను రద్దు చేశారు. తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో ఆది దంపతుల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వాడపల్లి లోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంతో పాటు పిల్లల మర్రి, మేళ్ల చెరువు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలం లోని గోదావరి తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చు కుంటున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీఆర్ పురం శివాలయం, నాచారం లోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో అభిషేకాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించి.. ఆ గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు..