మీకంటే మేమే బెటర్.. మోడీ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలు అబద్ధాలు…
- ప్రధాని వాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్….
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 3, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపైనా, ప్రభుత్వంపైనా ప్రధాని నరేంద్రమోడీ అపోహలు, అవాస్తవాలతో కూడిన ప్రకటన చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అధికార దుర్వినియోగం తర్వాత గతేడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా ఉత్సాహం, నమ్మకం పెరిగాయని తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే మొదటి హామీ మహిళలకు టీజీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం, రెండో హామీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచినట్టు గుర్తుచేశారు. గడిచిన 11 నెలల్లో సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి వెచ్చించకుండా 101 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పుల్లో ప్రయాణించారనీ, దీంతో వారికి రూ.3,433.36 కోట్లు మిగిలాయని చెప్పారు. ఏడాది పాలన కంటే ముందే భారతదేశ చరిత్రలోనే రైతును రాజును చేస్తూ 22,22,365 మందికి రుణమాఫీ చేసినట్టు తెలిపారు. ఒక్కో రైతుకు అత్యధికంగా రూ.2 లక్షల చొప్పున కేవలం 25 రోజుల్లోనే రూ.18,000 కోట్ల రుణమాఫీ అమలు చేసినట్టు వివరించారు. ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యంతో మహిళలు తమను ఆశీర్వదిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ ధరలను ప్రజలు భరించలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను 42,90,246 మందికి అందజేసినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దకాలం పాటు యువతకు ఉద్యోగాల కల్పన, పరీక్షల నిర్వహణలో విఫలమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల కన్నా తక్కువ కాలంలోనే గ్రూప్ 1, 2, 3, 4 ఇలా అన్ని రకాల పరీక్షలను రెగ్యులర్‌గా నిర్వహిస్తూ 50 వేల మంది అర్హులైన యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు వెల్లడించారు. బీజేపీ పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ రికార్డుతో పోల్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. దశాబ్దకాలంగా పాఠశాల విద్యార్థుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే, తాము వారి డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం పెంచడంతో వేడుకలు చేసుకుంటున్నారని సీఎం తెలిపారు. మూసీ పునర్జీవన, ప్రక్షాళనను గతంలో నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఆక్రమణకు గురైన, ధ్వంసమైన చెరువులు, నాలాలు, నీటి వనరులను కాపాడేందుకు చర్యలు తీసుకుందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంచు కూడా ఆక్రమణ కాలేదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీని సష్టిస్తున్నామనీ, దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించి నట్టు తెలిపారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీ అమలు పట్ల నిబద్దతతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ మిగిల్చిన చీకటిని, నిరాశను తిప్పికొట్టినట్టు చెప్పారు. తెలంగాణ ప్రస్తుతం ఉదయిస్తున్న సూర్యున్ని తలపిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.