భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు
– ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హర్షం
సూర్య జ్యోతి, నవంబర్ 07 : హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డా.రెడ్డీస్, అరబిందో, హెటెరో, లారస్, ఎంఎస్ ఎన్ మందుల కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ ప్రతిపాదనలను పంచుకున్నారు.
ఈ కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరం కూడా భాగంగా ఉంటుందని తెలిపారు. ఈ ఐదు ఫార్మా కంపెనీల్లో ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తొలి దశలో ఒక్కో కంపెనీ 50 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. గ్రీన్ ఫార్మా సిటీకి మంచినీరు, విద్యుత్తు సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిపారు.